కృష్ణా నది జలాల వినియోగం పై ఏపీ పరిరక్షణ సమితి ఫుల్ క్లారిటి

AP Conservation Committee Full Clarity on Krishna River Waters Utilization

0
35

“కృష్ణా నది జలాల వినియోగం – వివాదాలు” అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు చర్చా వేదిక నిర్వహించబడింది.

వివిధ రైతు సంఘాలు, రంగాలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. 

అనంతరం సమావేశం ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.

1. ట్రిబ్యునల్ తీర్పులు, విభజన చట్టానికి కట్టుబడి నదీ జలాల సమస్యను పరిష్కరించుకోవాలి. కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబునల్ తీర్పే శిరోధార్యం.

2. సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి తెచ్చిన మీదట ఆ తీర్పుకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలి.

3. రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించిన, మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టుల నీటి సమస్యను పరిష్కరించమని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించి బాధ్యతను అప్పజెప్పింది. ఆ విచారణ త్వరగా పూర్తయ్యేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. విభజన చట్టంలో ప్రస్తావించికపోయినా పై ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం చేపట్టబడిన ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టుకు నీటి కేటాయింపు చేయాలి.

4. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు/ఎత్తిపోతల పథకాలకు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన మీదటనే నిర్మాణాలను కొనసాగించాలి. రెండవ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గార్లు అంగీకరించిన మేరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, రాయలసీమ ఎత్తిపోతల పథకాల సమగ్ర అధ్యయన నివేదిక(డిపిఆర్)లను తక్షణం సమర్పించాలి. అలాగే మిగిలిన కొత్త పథకాలకు డిపిఆర్ లను కృష్ణా యాజమాన్య బోర్డుకు, ఎపెక్స్ కౌన్సిల్ కు సమర్పించి, అనుమతి పొందిన తర్వాతే నిర్మించుకోవాలి.

5. బచావత్ ట్రిబునల్ తీర్పులో ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయబడ్డాయి. ఆ కేటాయింపుల మేరకే రాష్ట్ర విభజన తర్వాత 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టియంసీలను వినియోగించుకోవాలి. గడచిన ఆరేళ్ళుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నియంత్రణలో నీటిని వినియోగించుకోవడం జరుగుతున్నది. దాన్ని కొనసాగించాలి.

6. కృష్ణా నది జలాలపై బచావత్ ట్రిబునల్ ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన డిమాండ్ అసంబద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదయోగ్యం కాదు.

7. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.), తెలుగు గంగ, గాలేరు-నగరి, చెన్నయ్ నగరానికి త్రాగునీరు, రాయలసీమకు త్రాగునీరు కోసం నీటిని తరలించే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబడిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను చట్ట వ్యతిరేకంగా నిర్మించబడిన, అక్రమ ప్రాజెక్టు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అసలు ప్రాజెక్టే కాదు. అది కేవలం హెడ్ రెగ్యులేటర్ మాత్రమేనని తెలిసి కూడా దుష్ప్రచారం చేయడం దారుణం.

8. శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులుగా 1996 ఫిబ్రవరి 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.నెం.69 నిర్ధేశించింది. దాన్ని ఉల్లఘించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలవిద్యుదుత్ఫత్తికి నీటిని వినియోగించడం చట్ట వ్యతిరేకం. తెలంగాణ ప్రభుత్వం తక్షణం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల వద్ద జల విద్యుదుత్ఫాదనను భేషరతుగా నిలిపివేయాలి.

9. కేంద్ర ప్రభుత్వం తక్షణం విభజన చట్టం మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిథిని నిర్ణయించి, గజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, అమలు చేయాలి.

10. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణం నిర్వహించి, రెండవ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల అమలు, ప్రస్తుత వివాదాలను పరిష్కరించాలి.

11. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, నదీ జలాల సమస్యలపై కృషి చేస్తున్న ఉద్యమకారులతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, నదీ జలాల వివాదంపై చర్చించి, సమిష్ట కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించుకోవడానికి రాజీలేని పోరాటం చేయాలి.

12. కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును భేషరతుగా ఉపసంహరించుకొని, బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం వ్రాయాలి.

ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రివర్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి, అధ్యక్షులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యెలినేని కేశవరావు, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఆళ్ళ వెంకట గోపాల కృష్ణరావు, రాయలసీమ సాగు నీటి సాధన సమితి, అధ్యక్షులు శ్రీ బొజ్జా దశరథరామిరెడ్డి, రైతు నాయకులు డా.కొల్లా రాజమోహన్, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ బహుజన అభివృద్ధి వేదిక, కన్వీనర్ శ్రీ పోతుల బాలకోటయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మల్నీడు యలమందరావు, కాంగ్రెస్ నాయకులు శ్రీ వినయ్ కుమార్, అమరావతి రాజధాని పరిరక్షణ జె.ఎ.సి. నాయకులు శ్రీ తిరుపతిరావు, జర్నలిస్టుల యూనియన్ నాయకులు శ్రీ కృష్ణాంజనేయులు, శ్రీ లక్ష్మణరావు, తదితరులు పాల్గొని, ప్రసంగించారు.