ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..

AP government another key decision

0
34

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్‌ ద్వారానే నీటి తడులు అందించేందుకు ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ఆలోచనలు చేస్తోంది. ఈ ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయ భారం సదరు గ్రామ పంచాయతీలపై పడకుండా ప్రభుత్వం మార్గాలను విశ్లేషిస్తుంది.

రాష్ట్రంలో 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5 వేల పైచిలుకు ఉన్నాయి. వీటికి సొంత ట్రాక్టర్లు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. ఇవికాక 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని పంచాయతీలు 91 ఉన్నాయి. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 5,228 గ్రామాలకు ఉచితంగా కొత్తగా ట్రాక్టర్లు అంజేయాలన్నది ప్రభుత్వ యోచన.

గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లను వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఆ డబ్బు పంచాయతీకి వస్తుంది. ఈ డబ్బుతో ట్రాక్టర్‌ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.