తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా? 2018లో తరహాలోనే కేసీఆర్ ఈసారి ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారా? బిజెపిపై వార్, బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట, ఎన్నికల వ్యూహకర్త పీకే ఎంట్రీ ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతాలా? ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే ముందస్తు గంటలు స్పష్టంగా కొడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ చీఫ్ రేవంత్, పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందస్తు ఎన్నికలు రానున్నాయని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనితో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా బీజేపీని టార్గెట్ చేసుకున్నారు సీఎం కేసీఆర్. వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రధాని మోదీతో నుండి బండి సంజయ్ వరకు అందరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ కాస్త పుంజుకోవడం దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక అన్నింటికీ మించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను టీఆర్ఎస్‌కు పని చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే టాప్‌లో ఉన్న పీకే తన వ్యూహాలతో అనేకమంది నాయకులని గెలిపించారు. తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు. పీకే స్ట్రాటజీలతోనే జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ లాంటి వారు గద్దెనెక్కారు. అందుకే ఆయన వ్యూహాలని వాడుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారు.
పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులకు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే నేడు ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన వెనుక పీకే ఉన్నట్లు నిరుద్యోగ యువత మాట్లాడుకుంటున్నారు. 2018లో కూడా సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలను వెళ్లి విజయం సాధించారు. ఈసారి కూడా అదే జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగానే పీకే వ్యూహరచనలు, కేసీఆర్ స్ట్రాటజీ చూస్తుంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.