నెక్ట్స్‌ సీఎం అభ్యర్థి మీరేనా? కేటీఆర్ కు నెటిజన్ల ప్రశ్నలు..మంత్రి ఆన్సర్​ ఏంటంటే?

0
71

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామారావు ఈరోజు ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం, రాజకీయాలపై కేటీఆర్ స్పందన

పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని, ఈ విషయంలో ప్రధానమంత్రి పేదలకు సహాయం చేయడంమాని కార్పొరేట్ సంస్థలకు సుమారు 12 లక్షల రుణాలను మాఫీ చేశారని, అది ప్రధానమంత్రి స్టైల్ అని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర విపక్షాలు ఉన్న ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయి పైన దృష్టి సారించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్ప్లే పిక్చర్ (డిపి) మార్చడం వల్ల ఏమవుతుందని, జిడిపి మారితే దేశానికి మంచి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఒకరు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ప్రధానమంత్రిని  అగౌరవపరిచామన్న మాట తలెత్తదని, ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ర్టాల్లో పర్యటిస్తే, ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో బిజెపికి ఉన్న మందబలంతో ప్రజలపైన భారీగా పన్నులు పెంచుతుందని, రాష్ట్రాలు వ్యతిరేకించినా, పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదనే విషయాన్ని తెలిపిన కేటీఆర్, జిఎస్టి కౌన్సిల్ కేవలం సలహా ఇచ్చే యంత్రాంగం మాత్రమే అని, నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా రైతులు, ఇతర తరగతుల వర్గాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని కేటీఆర్ అన్నారు.

బిజెపి మరియు ప్రస్తుత రాజకీయాలపైన కెటియార్ స్పందన

బిజెపి నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బిజెపి నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయడం, ద్వేశం పెంచడంలో సిద్ధహస్తులని కేటీఆర్ అన్నారు. అయితే బిజెపి అబద్ధపు ప్రాపగాండను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న పనులు అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామన్నారు. బండి సంజయ్ స్వయంగా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆ విషయం నువ్వే చెప్పాలంటే చమత్కరించారు. వచ్చే సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే అని కేటీఆర్ చమత్కరించారు. బిజెపి జాతీయవాదం, మతవాదంతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందని, ఈ విషయంలో మీరు వెనుక పడ్డారన్న ప్రశ్నకు సమాధానంగా తమది అభివృద్ధి పూర్వక జాతీయవాదమని, దానిపైననే తాము దృష్టి సారించామన్నారు.

తెలంగాణ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సేవ చేయడం కొనసాగిస్తుందన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తున్న కేసీఆర్ గారు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి లేదా కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమానంగా తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో పోరాడాలన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేవలం జాతీయ పార్టీలతోనే ఎందుకు అనేక ఇతర పార్టీలు కూడా ఉన్నాయిగా అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికపై

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ కామెంట్ అంటే ముదు ఎన్నిక తాలుకు ప్రకటన జారీ అవ్వనీ అని అన్నారు. తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని ప్రశ్నించారు

పలు సమస్యలపై కేటీఆర్ స్పందన

రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు మరియు పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యలను  తామేందుకు పట్టించుకోమని ప్రశ్నించిన కెటియార్, వాటిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోపాటు వైస్ ఛాన్స్లర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ నగరంపై

హైదరాబాద్ నగరంలో మురికి నీటి నిర్వహణకు సంబంధించి ఎస్ఎన్ డిపి కార్యక్రమం కొనసాగుతుందని దాని పూర్తి ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపిన కేటీఆర్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం పైన హైకోర్టు స్టే ఇచ్చిందని  దాన్ని రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఈబిఆర్ టిఎస్ వంటి అనేక ప్రణాళికలపై పనిచేస్తున్నామని త్వరలోనే మెట్రో విస్తరణ పై కూడా ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. ట్యాంక్ బండ్ పైన కొంతకాలం కొనసాగిన సండే ఫన్  డే కార్యక్రమం త్వరలో తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపిన కేటీఆర్ అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్యంగా హెచ్ఎండిఏ ఇప్పటికే 19 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరిన్ని అర్బన్ లంగ్ స్పేస్ లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

పరిశ్రమలు, సంభందిత రంగాలపై

హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఏవియేషన్ యూనివర్సిటీ లేదా ప్రత్యేక విద్యాసంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నెటిజన్ ఇచ్చిన సలహా మేరకు స్పందించిన కేటీఆర్ ఇప్పటికే  క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏవియేషన్ సంబంధిత సిలబస్ ని ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దేశంలోని అన్ని ఇతర నగరాల కన్నా వేగంగా ముందుకు పోతున్నదని, ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించబడ్డాయని తెలిపారు. ఐటీ పరిశ్రమను నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను గ్రిడ్ పాలసీ ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు దాదాపు పదివేల ఎకరాల్లో 19 విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు వంట నూనెల విషయంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భూ సేకరణకు సంబంధించిన స్వల్ప సమస్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మసిటీ ప్రారంభోత్సవం కొంత ఆలస్యం అవుతుందని, త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి అన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

పలు ఇతర అంశాలు

తన కాలి గాయం నుంచి కోరుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపార

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటీ మంత్రి అవ్వాలన్న ట్వీట్ కు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నట్లు, పశ్చిమబెంగాల్ విషయంలో మమతా బెనర్జీ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తున్నారన్నారు.

రాజకీయాల్లోకి ఎలాంటి నేపథ్యం లేకుండా కూడా రావచ్చని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇందుకు ఉదాహరణ అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వాటిని ఆకలింపు చేసుకోవాలన్నారు.

ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులకు మన అందరి మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు

జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్రం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లాడుతున్న వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా వాక్ స్వేచ్చను సమర్థించే ప్రజాసామిక ప్రభుత్వం మాదని అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ వాక్  స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని దాన్ని, ఏవరం సహించాల్సిన అవసరం లేదన్నారు.