సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ బండి సంజయ్ ఆదివారం రాత్రి కరీంనగర్లో చేపట్టిన జాగరణ దీక్షపై పోలీసులు ఓవరాక్షన్ చూపించారు.
ఆయన దీక్షకు దిగిన ఎంపీ ఆఫీసులోకి పోలీసులు వాటర్ పంపింగ్చేసి, డోర్లు పగులగొట్టి, గ్రిల్స్‌ను గ్యాస్‌కట్టర్‌తో ఊడగొట్టి లోపలికి ప్రవేశించారు. దొరికినవాళ్లను దొరికినట్టు అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు బండి సంజయ్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ రిమాండ్ పై నాన్ బెయిలెబుల్ కేసు నమోదుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తుంది. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకైనా వెళ్తా..ఎంతదాకానైనా పోరాడేందుకు సిద్ధమని బండి సంజయ్ ప్రకటించారు.
బండి సంజయ్ ను బేషరతుగా విడుదల చేయాలంటూ కరీంనగర్ కు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చిస్తున్నారు. ఏ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో యాక్షన్ ప్లాన్ ను ప్రకటించే అవకాశం ఉంది.