తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రెండు సార్లు యాత్రలు విజయవంతం అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రులు, నాయకులు హాజరయ్యారని అన్నారు. మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇలవేల్పు అయిన యాదాద్రి నుంచి మొదలవుతుందని సంజయ్ అన్నారు.
ఈ యాత్ర ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్న పేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. మొత్తం 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలో మీటర్ల మేర సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది.