దళిత బంధు లబ్దిదారులకు బిగ్ షాక్..!

Big shock for Dalit relatives ..!

0
88

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ భావిస్తుంది.

దళితబంధు పథకం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలు, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 70 కుటుంబాలకు పథకం మంజూరైంది. హుజూరాబాద్‌లో 1250 కుటుంబాలు, వాసాలమర్రిలో 60 కుటుంబాల యూనిట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితోపాటు చింతకాని (మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌), నిజాంసాగర్‌ (జుక్కల్‌, కామారెడ్డి) మండలాల్లో పథకం అమలుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.

ఇందులో భాగంగా హుజురాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఈ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఆశావాహ ఎస్సి కుటుంబాలు ఎమ్మెల్యేలకు దరఖాస్తును సమర్పించాయి. ఎంపికకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు తమ విచక్షణ మేరకు ఎంపిక చేస్తున్నారు. జాబితాలో లేని ఇతర ఆశావహ కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రస్తుతం గోప్యత పాటిస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా ఎంపిక జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక సరిగా లేకపోవడంతో అసలు లబ్దిదారులకు షాక్ తగులుతుంది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల జాబితాలు ప్రభుత్వానికి అందగా… ఈనెల 25వ నాటికి మిగతావి చేరనున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి నెలాఖరు నాటికి ఆయన లబ్ధిదారులు యూనిట్లు స్థాపించాలని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.