Breaking News : గాలికి గెలవ లేదు – మళ్లీ ఈటల మాటల తూటాలు

Etela Rajender Sensational Comments On Cm KCR at Huzurabad

0
82

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడుతున్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో మీడియా సమావేశంలో ఈటల మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చదవండి…

20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఓటమి ఎరుగకుండా గెలిచాను. ఏదో గాలికి గెల్వలేదు. నన్ను నమ్మి ఓటేస్తే గెలిచిన. అధికారంలో ఉన్నా… లేకపోయినా ఎప్పుడైనా ప్రజల కోసం ఉన్నంతలో పనిచేసి వారి మెప్పు పొందాను. మొన్న కరీంనగర్ ఎంపీ సీటు టిఆర్ఎస్ ఓడిపోయింది. కానీ నా నియోజకవర్గంలో 50వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి ఆదుకుంది. నన్ను చూసి ప్రజలు ఓటేశారు. ప్రజలు నన్ను అడుగుతున్నారు… బిడ్డా మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. పెళ్లిళ్లు జరిగి రెండేళ్లు అయితే ఇప్పుడు చెక్కులు వచ్చేటట్లు ఉన్నాయి. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇప్పించాలని సిఎం ను డిమాండ్ చేస్తున్నాను.

కొంతమంది నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. సొంత పార్టీ పెడుతున్నాడని విమర్శలు చేశారు. వేరే పార్టీలోకి పోతున్నాడని అన్నారు. కానీ నేను ఏ పార్టీ పెట్టలేదు. ఏ పార్టీలోకి పోలేదు. మీరే నన్ను బహిష్కరించారు. ఒక అనామకుడు కాయితం రాసిస్తే నన్ను ఒక్క మాట కూడా అడకకుండా బహిష్కరించారు.

నన్ను బతికుండగానే బొందపెట్టాలనుకున్నరు. కానీ మీరు తోడుకున్న బొందలో మీరే పడబోతున్నరు. అధికార దుర్వినియోగానికి పాల్పడదాము అనుకున్నరేమో మీ ఆటలు సాగవు.ఈటల గెలుపు అంటే ఆత్మ గౌరవం గెలుపు. నాలాంటి వాడు మాట్లాడితేనే మీకు తెలుస్తది. నేనేమీ తప్పు చేసిన.. ఐకెపి సెంటర్ల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొంటుంది అని చెప్పిన… అది కూడా నేరమా? కొంతమంది చెంచాగాళ్లతో నామీద కరపత్రాలు కొట్టించి పంచుతున్నారు.

2018లో నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. అన్ని భరించాను. అది నా సహనం తప్ప భయం కాదు. నా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇక్కడ కురక్షేత్రం జరగబోతున్నది. ధర్మానికి, ధర్మానికి జరగబోయే యుద్ధం. తప్పకుండా విజయం హుజూరాబాద్ ప్రజలదే. ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చేయండి. దొంగదారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు సహించరు. కర్రు కాల్చి వాత పెడతారు. చిల్లర వేశాలు వేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.అన్ని జిల్లాల నుంచి నాకోసం ఫఓన్ చేసి రాజేందర్ అన్నను జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు.