వ్యవసాయ రంగంలో ఏపీ ఏకంగా 11 శాతం అభివృద్ధి సాధించిందని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలను ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. ‘‘ఏపీలో వ్యవసాయం ఎన్నడూ లేనివిధంగా దూసుకెళుతుందని టీడీపీ సభ్యులు అన్నారు. దానికి నేను సమాధానం చెబుతా అధ్యక్షా. మేం నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా ‘గతంలో రెండంకెల వృద్ధి నమోదయినట్లు ప్రభుత్వం చెప్పింది. అసలు ఆ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అని’ చూశాం.
టీడీపీ నేతలు ఏం అంటున్నారంటే వ్యవసాయ రంగంలో పెరిగిన ఆదాయం వ్యవసాయం వల్ల రాలేదంట. చేపల పెంపకం కారణంగా వచ్చిందంట. ఎన్ని చేపలు కలిపితే ఎంత వ్యవసాయం అవుతుంది అధ్యక్షా. అయినా ఇది వాస్తవం కాకపోవచ్చని మేం చెప్పాం. ఎందుకంటే దేశంలో వ్యవసాయ ఆదాయాన్ని లెక్క పెట్టేందుకు దేశమంతటా ఓ ప్రమాణిక పద్ధతి ఉంది. కానీ గొర్రెలు, చేపల పెంపకానికి సంబంధించి అలాంటి పద్ధతి ఏది లేదు.
కాబట్టి టీడీపీ నేతలు ఏమేం లెక్కలు రాసుకున్నారో చేపల గురించి? అధ్యక్షా.. వాస్తవానికి కడప జిల్లాలో 2,000 లారీల చేపలు వచ్చాయంట అధ్యక్షా. కడప జిల్లాలో ఏమున్నాయి అధ్యక్షా. ఉండేది ఒక సోమశిల ప్రాజెక్టే. ఆ నీళ్లు కూడా కొన్నిసార్లు ఉంటే, మరికొన్ని సార్లు ఉండవు. దాంట్లో 2,000 లారీల నిండా చేపలు ఎట్లా వస్తాయి అధ్యక్షా? .. దానికి 30 శాతం, 40 శాతం పెరిగినట్లు చూపిస్తున్నారు. వ్యవసాయం పెంచాలన్నప్పుడు ప్రతీసారీ చేపల ద్వారా ఆదాయం పెరిగింది అని చెప్పారు. ఇది తప్పని మేం చెబుతున్నాం అధ్యక్షా.’ అని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.