తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు..మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

Celebrations all over Telangana..Minister KTR Direction

0
93
KTR

తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.

టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, రైతుబంధు అధ్యక్షులు, డిసియంయస్ చైర్మన్ ల తో జరిగిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి కే. తారకరామారావు రైతుబంధు సంబరాలపై దిశానిర్దేశం చేశారు.

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కాని చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో..తెలంగాణ రైతుల గురించి కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు. ఈ కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. రైతు బందు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతుల్లో ఎనలేని సంతోషంగా ఉన్నది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారింది. ఇలా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు ఖాతాల్లోకి చేరిన సందర్భం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇది అద్భుతమైన సందర్భం. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని మనమంతా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది.

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం రైతన్నల కోసం మన నాయకుడు కేసీఆర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులయిన చెరువుల బలోపేతం వరకు… రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు ఎవరు కనివిని ఎరుగని గొప్ప కార్యక్రమాలను కెసిఆర్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో రైతు బంధు కార్యక్రమం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరనున్న సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలి. జనవరి మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతు బంధు సంబరాలు నిర్వహించాలి.

తాజాగా ప్రభుత్వం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని ఈ రైతుబంధు సంబరాలు నిర్వహించాలి శాసన సభ్యులు ఈ సంబరాల విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. రైతుబంధు సంబరాల్లో భాగంగా కింది కార్యక్రమాలను నిర్వహించవచ్చు. దీంతో పాటు స్థానికంగా ఎవరికైనా మరిన్ని మంచి ఆలోచనలు వస్తే వాటిని కూడా ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించవచ్చు. రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా..మహిళా లోకాన్ని కలుపుకొని పోయేలా కార్యక్రమాలు నిర్వహించాలి.

విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలి. ఈ రెండు కార్యక్రమాలు చేపడుతే మహిళా లోకంతో పాటు భవిష్యత్ తరానికి కూడా రైతుబంధు గురించిన మరింత అవగాహన కలుగుతుంది. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఆరు వందల కుపైగా రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు చేయాలి. 3 తేదీ 10 వరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంబరాలను వినూత్నంగా చేయాలి. తాము నిర్వహించే ఈ సంబరాలకు స్థానికంగా ఉన్న పత్రికలు, స్థానిక టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారం వచ్చేలా సమన్వయం చేసుకోవాలి. ఆయా నియోజకవర్గాల్లో రైతులకు అందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలి. స్థానిక ప్రజలు అందరికీ చేరేలా శాసనసభ్యులు సవివరమైన ఒక లేఖను రాస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సంబరాలకు సంబంధించి కావలసిన ఎలాంటి సమాచారాన్ని అయినా మా శాఖ ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నది. మా శాఖ తరఫున కూడా అవసరమైన ప్రచార మరియు సమాచార సామాగ్రిని సిద్ధం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 63 లక్షల తెలంగాణ రైతులకు రైతుబంధు అందిస్తున్న అపురూప కార్యక్రమం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో లేదనడం అతిశయోక్తి కాదు.

సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది… అలాంటి ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వ రైతు బంధు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఏక కాలంలో అత్యధిక మందికి ఉపాధి ఇయ్యగలిగే వ్యవసాయ రంగాన్ని ఎంత పటిష్టం చేస్తే అంత మంచిదని కెసిఆర్ దూరదృష్టి, దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో మనమంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.