కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ మహమ్మారి నుండి బయటపడడానికి కేంద్రం కరోనా వాక్సిన్ ను తీసుకొచ్చింది. మొదట దీనిపై అనేక పరిశోధనలు చేసిన తరువాత ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం కోవిడ్ ను ఎదర్కోడానికి ఉన్న ఏకైక అస్త్రం కరోనా వాక్సిన్ మాత్రమే.
ఇప్పుడు దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా సూచించింది. ఈ మేరకు బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రెండు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత 9 నెలలకు బూస్టర్ డోస్‌ను వేస్తున్నారు. తాజాగా ఈ వ్యవధిని 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్మూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.