దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. అలాగే 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్ యాప్లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు కూడా విధించాయి.