భారతీయులకు చైనా గుడ్ న్యూస్..వీసాలపై కీలక ప్రకటన జారీ

0
83

ఇండియన్ స్టూడెంట్స్ కు విసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. కరోనా సమయంలో భారత్‌కు వెళ్లి, ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు, అలాగే వివిధ రకాల వారు తిరిగి చైనాకు రావడానికి వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా సోమవారం ప్రకటించింది.

‘భారతీయ విద్యార్థులూ మీకు అభినందనలు. మీ నిరీక్షణ ఫలించింది. చైనాకు తిరిగి స్వాగతం. మీతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్‌ జీ రోంగ్‌ ట్వీట్‌ చేశారు.

విద్యార్థులకు, వ్యాపారులకు, చైనాలో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులకు సంబంధిత వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని దిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం కూడా ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వెళ్లేవారికి, నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్నవారికి ఎక్స్‌-1 వీసాలను జారీ చేస్తామని తెలిపింది.

ఇప్పుడు కొత్తగా చైనాకు వెళ్లేవారు విశ్వవిద్యాలయాలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా నిమిత్తం సమర్పించాలి. పాత విద్యార్థులైతే విశ్వవిద్యాలయ ప్రాంగణానికి తిరిగి వచ్చేందుకు చైనా జారీ చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ప్రస్తుతానికి చైనాకు నేరుగా విమానాలు లేకపోవడం మాత్రం సమస్యగా మారనుంది.