ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి ఇటీవల భేటీ అయ్యారు. చిరంజీవి, జగన్ మధ్య మర్యాదపూర్వక లంచ్ భేటీ జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు. తాను ఇండస్ట్రీ తరఫున సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చానని చిరంజీవి అప్పుడు పేర్కొన్నారు. తాజాగా మరోసారి వీరిద్దరూ సమావేశం కానున్నారు.
ఈ మేరకు ఈనెల 10న జగన్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరికొంత మంది ఇండస్ట్రీ పెద్దలు సీఎంను కలువనున్నట్లుగా సమాచారం. సినీ పరిశ్రమలో నెలకొని ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటు టికెట్ రేట్ల తగ్గింపు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే మళ్లీ చిరు, జగన్ భేటీ కాబోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదివరకు ఓ సారి సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి త్వరలోనే సమస్యలన్నీ తీరుతాయంటూ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే సమయంలో త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలతో మరోసారి సమావేశం అవుతామని చిరంజీవి వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించకూడదని సమస్యను మరింత జఠిలం చేయవద్దని ఆ సమయంలోె చిరంజీవి కోరారు.






