రాష్ట్రంలో కారు పని అయిపోయింది.. షెడ్డుకు పోయిందని.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎద్దేవా చేశారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu) నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని తమ ప్రభుత్వాన్ని పడగొడితే అడబిడ్డలు చూస్తూ ఊరుకోబోరన్నారు. తమ ప్రభుత్వం ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ తమను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
“కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువ్వు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త” అంటూ హెచ్చరించారు. కాగా గతంలో మెదక్ ఎంపీగా ఇందిరమ్మను గెలిపిస్తే ఆమె ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. 1999 నుంచి 2024 వరకు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ తేలేదని రేవంత్(Revanth Reddy) వెల్లడించారు.