‘‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’..హైదరాబాద్‌లో టీహబ్‌-2 ప్రారంభం

0
114

ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీ-హబ్ హైదరాబాద్ లో నిర్మించబడింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి కల్పించేలా నిర్మించిన అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ గా వెలుగొందనుంది.

‘‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘‘ టీ హ‌బ్ -2.0 ’’ను, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి మంగళవారం ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌ను ఏర్పాటు చేయగా..టీ హ‌బ్ -2.0 ’’ను నిన్న ప్రారంభించారు.

ఐటీ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ తొలిదశలో రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన టీ హబ్ -1 అనూహ్యంగా 1200 స్టార్టప్ లతో విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా టీ హబ్ – 2.0 రూపుదిద్దుకున్నది. ఇన్నోవేషన్ అనుసంధానకర్తగా టిహబ్ నిర్మితమైంది. భారత దేశ ఇన్నోవేషన్ , ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ స్వరూపాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా హైద్రాబాద్ కేంద్రంగా టిహబ్ నిలిచింది. మరిన్ని సృజనాత్మక ఆలోచనలకు సజీవ రూపమిస్తూ, అంకుర పరిశ్రమలకు జీవం పోసేలా, ఏక కాలంలో పనిచేసేలా వేలాది స్టార్టప్ లకు ఊతమిచ్చే లక్ష్యంతో టీ హబ్ -2.0 ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

కాగా, టీ హ‌బ్-2.0 ప్రారంభం సందర్భంగా ఇన్నోవేషన్ టార్చ్ (కాగడా) ను అధికారులు సీఎం కేసీఆర్ కు అందించగా, టీ హ‌బ్-2.0 నమూనాను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రాంగ‌ణమంతా సీఎం కెసిఆర్ క‌లియ తిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను వాటి వివరాలు తెలుసుకున్నారు. టిహబ్ పై అంతస్తులో కారిడార్లో కలియ తిరిగి నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. దేశ విదేశాల్లోని ఐటి కేంద్రాలను తలదన్నేలా నిర్మితమైన భవనాలను సిఎం తిలకించారు.

ఫెసిలిటీ సెంట‌ర్ ప్ర‌త్యేక‌త‌ల‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు, పలు రకాల కంపెనీల ప్రతినిధులు టి హబ్ కేంద్రంగా చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన.. మీటింగ్ హాల్స్, వర్క్ స్టేషన్లను సిఎం పరిశీలించారు. టిహబ్ ఇన్నొవేషన్ సెంటర్ కు సంబంధించిన విషయాలన్నింటినీ అధికారులను మంత్రి కెటిఆర్ ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. టి హబ్ ను అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో అత్యాధునిక డిజైన్‌తో సాండ్‌ విచ్‌ ఆకారంలో ప్రత్యేకంగా టీ హబ్ ను నిర్మించడం జరిగిందని వారు తెలిపారు.

టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించామని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. మొదటి అంతస్తులో మొత్తం వెంచర్ కాపిటలిస్టులకోసం కేటాయించామని మంత్రి కెటిఆర్ సిఎంకు తెలిపారు. టిహబ్ భవనం చుట్టూ విస్తరించి వున్న ప్రముఖ కంపెనీలను సిఎం కలియతిరుగుతూ పరిశీలించారు. గేమింగ్, యానిమేషన్, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృష్టి చేస్తున్న సంస్థలన్నీ హైద్రాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు.

ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్ తో పాటు, అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరుచుకునే దిశగా, సైబర్ క్రైం ను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూంను మరింతగా అభివృద్ది చేసేందుకు టిహబ్ తో సమన్వయం చేసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్ సూచించారు.

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా., దైనందిన జీవితంలో సామాన్య ప్రజల జీవన విధానాలు గుణాత్మకంగా పురోగమించేందుకు అంకుర సంస్థలు కృషి చేసేందుకు టిహబ్ దృష్టి సారించాలని సిఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న యువతలోని టాలెంట్ ను కూడా వినియోగించుకునే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సిఎం తెలిపారు. భవిష్యత్తులో హైద్రాబాద్ లో ఐటి రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుందని, దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టిసారించాలని సిఎం అన్నారు.

టీ హబ్‌-2 ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ స్పీక‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్థన్ రెడ్డి, టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఎస్ టిఎస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు, సీ ఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి, టిహబ్ సీఈవో శ్రీనివాస రావు, బిఆర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టిహబ్ లో అంకుర సంస్థల ప్రతినిధులు దేశ, విదేశాలకు చెందిన ఐటి రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. టిహబ్ నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురితో పాటు టిహబ్ లో భాగస్వాములైన పలు అంకుర సంస్థల ప్రతినిధులను, సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు.