నామా ఆస్తులపై ఈడి దాడుల వెనుక అసలు రహస్యం ఇదేనా?

0
87

ఖమ్మం ఎంపీ, టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇటీవల దాడులు చేసింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతున్న క్రమంలో ఈ దాడులు జరగడం పట్ల అనేక అనుమానాలు కలిగాయి. అయితే ఈ దాడుల విషయంలో తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. అసలు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఈడి దాడులు చేసిందని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. మధుకాన్ సంస్థపై వచ్చిన అభియోగాలు అవాస్తవాలు అని చెప్పారు.

నామా మీడియా సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించారు. వాటిని కాసేపు పక్కన పెడితే… ఎవరూ ఫిర్యాదు చేయకుండానే దాడులు చేశారని నామా మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సాధారణంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనేది ఫిర్యాదులు లేకుండా దాడులు చేస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈడి కానీ, సిబిఐ కానీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలే అన్న ప్రచారం అయితే ఎప్పటినుంచో ఉంది. అంతేకాదు… ఎవరినైనా లొంగదీసుకోవాలన్నా, ఎవరినైనా ఇబ్బందులకు గురిచేయాలన్నా, ఏ పార్టీ నాయకుడినైనా లోబర్చుకోవాలన్నా… వెనువెంటనే ఈడి, సిబిఐ లు రంగంలోకి దిగుతున్నాయన్న రాజకీయ విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో నామా నాగేశ్వరరావును కేంద్రంలోని బిజెపి సర్కారు టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నామా నాగేశ్వరరావు గతంలో టిడిపిలో ఉన్నారు. ఆయన చంద్రబాబు సామాజివర్గమే ఆయనది కూడా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మంచి ఆదాయ వనరుగా కూడా నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఈ సమయంలో ఏ కంప్లెంట్ లేకుండా ఆయన కంపెనీ మీద దాడులు జరిగాయంటే ఏదో గూడుపుటానీ జరుగుతోందన్న అనుమనాలైతే రేకెత్తుతున్నాయి.

ఈ దాడుల వెనుక ఈటల రాజేందర్ కోణం ఉన్నా… ఉండకపోయినా… నామా ఆస్తులపై ఈడి రైడ్స్ విషయంలో ఎంతో కొంత రహస్య ఎజెండా మాత్రం కనబడుతున్నది. ఈడి దాడుల వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చా… అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నామా మౌనం దాల్చారు. మౌనం అర్ధాంగికారం అని కూడా అంటారు. దీన్నిబట్టి రాజకీయ ప్రమేయంతోనే నామా ఆస్తులపై ఈడి దాడులు జరుగుతున్నట్లు కనబడుతున్నది.

నామాను అర్జెంట్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం బిజెపికి ఎందుకొచ్చిందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. టిఆర్ఎస్ కు ఆర్థిక వనరులు అందజేసేవారిపై రైడ్స్ చేయాలని ఏమైనా ఈటల కోరి ఉండవచ్చా అన్న అనుమానాలు టిఆర్ఎస్ వర్గాల్లో సైతం కలుగుతున్నాయి. ఇక తనపై ఎన్ని దాడులు చేసినా, ఎంతగా ఇబ్బందుల పాలు చేసినా సిఎం కేసిఆర్ వెంటే ఉంటానని నామా మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసిఆర్, ఖమ్మం ప్రజలే తన బలమని, ఈడి దాడులు తనను విస్మయానికి గురిచేశాయని ఆయన కామెంట్స్ చూస్తే… నామా భుజాల మీద తుపాకీ పెట్టి… గురి ఇంకెక్కడో పెట్టినట్లు అయితే కనబడుతున్నది.