ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం..తెలంగాణ సర్కార్ నిర్ణయం

0
121

తెలంగాణలో కరోనా విజృంభణతో ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. ఇప్పుడు ఏ తేదీ కూడా దగ్గర పడడంతో అసలు స్కూళ్లు తెరుస్తారా లేదా అనే అయోమయంలో విద్యార్థులు ఉన్నారు.

ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. పదో తరగతి పరీక్షలు దగ్గర పడడం, పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలుతెరుచుకోనున్నాయి. ఈ విషయంపై తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.