కేసిఆర్ కుటుంబసభ్యుల కనుసన్నల్లో నడిచే నమస్తే తెలంగాణపై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తన నివాసంలో తన తనయుడు ఈటల నితిన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు జమున. ఆనాడు నమస్తే తెలంగాణ పత్రిక లాంచింగ్ సమయంలో తాము ఆ పత్రిక యూనిట్ కోసం స్థలం ఇచ్చామని చెప్పారు. నేడు అత్యంత పాశవికంగా అదే పత్రిక మాపై దుష్ప్రచారం చేయడం బాధాకరం అన్నారు. తాము 6 ఎకరాలు కుదువ పెట్టి నమస్తే తెలంగాణ కు ఇచ్చామన్నారు. ఆ పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవవు అని హెచ్చరించారు.
కేసిఆర్ నియమించిన విచారణ అధికారులు వావి వరసలు మరిచి రిపోర్ట్ ఇవ్వడం ఎంటని నిలదీశారు. దేవర యాంజల్ భూములు 1994 లో కొనుగోలు చేశామన్నారు. తమ గోదాములు ఖాళీ చేయించాలని, ఆర్థిక వనరులు దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ… అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం మాకు తెలుసు అన్నారు. తాను ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నాని… అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి.. అలా నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధం. లేదంటే మీరు ముక్కు నేలకు రాయడానికి సిద్ధం కావాలి అని జమున సవాల్ విసిరారు.
తెలంగాణ కోసం కొన్నిఆస్తులను అమ్ముకున్నామని… ఈటెల రాజేందర్ చేసే ఆత్మగౌరవ పోరాటానికి యావదాస్తిని అయినా అమ్మడానికి తాను సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని బాధపడుతూ చెప్పారు. ఆనాడు నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారు.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు. అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలైన కాలంలో ఉద్యమం వదిలి వైఎస్సార్ వెంట రావాలని అప్పటి దేవాదాయశాఖ మంత్రి రత్నాకర్ రావు చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఈటెల వెళ్ళలేదన్నారు. కేసీఆర్ మంచోడు కాదని వారు అప్పుడే చెప్పారని వెల్లడించారు. రాష్ట్రం లో మంత్రులు కూడా మినిష్టర్ క్వార్టర్లో దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఉండడం విచారకరమన్నారు.