ALERT: తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచే..18 వేలకు పైగా ఖాళీలు..నియామక ప్రక్రియ అప్పుడే?

0
35

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో 95 శాతం జాబులు ఆ జిల్లాల వారికే దక్కనున్నాయి. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడుతుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం పోలీస్ శాఖ నుండి తొలి నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది.

జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితాతో ఇప్పుటికే సిద్ధంగా ఉన్న అధికారులు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టి.ఎస్‌.ఎల్‌.ఆర్‌.బి.) కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో దాదాపు 18 వేలకు పైగా ఖాళీలున్నట్లు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

ముందుగా పోలీస్ శాఖే ఎందుకంటే?

ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి పోలీస్ శాఖనే ఎంచుకోవడంలో ప్రభుత్వానికి ఓ లెక్క ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మిగతా శాఖలకు కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు అత్యధిక ఖాళీలున్న విద్యాశాఖ నియామక ప్రకటన ఇవ్వాలంటే ముందు టెట్‌ నిర్వహించాలి. పోలీసుశాఖకు అలా కాదు. 2018లో 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ఎంపికైన వారి శిక్షణ పూర్తి కాగానే మరో మారు భారీస్థాయిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించి పెట్టింది. గత జులైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించారు. చివరి నిమిషంలో ప్రభుత్వం అభిప్రాయం మార్చుకోవడంతో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. అందువల్ల సర్కారు నుంచి అనుమతి వచ్చిన వెంటనే పోలీస్‌శాఖ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.