మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం ఇలా..

Former CM Konijeti Roshaiya's political reign ..!

0
41

రాజకీయ కురువృద్ధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఇవాళ ఉదయం రోశయ్య పల్స్‌ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయణ్ని హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు.

రోశయ్య 1933 జులై 4న ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. 2021 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సనత్ నగర్ లో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో మరణించారు అయితే ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన మొత్తం 18 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న రెవెన్యూ శాఖ మంత్రిగా నిలిచారు. ఆయన వాక్చాతుర్యంతో అసెంబ్లీలో అందర్నీ హడలెత్తించిన వారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పని చేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు.రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.

1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆర్థికమంత్రిగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పని చేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.

ముఖ్యమంత్రిగా

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.

1968 నుంచి వివిధ హోదాల్లో రోశయ్య

1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009, సెప్టెంబరు – 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.

గుర్తింపులు

2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు… రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ… తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు.

తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరివారే సాటి అని తెలిపారు.