గుడ్ న్యూస్..నేటి నుంచి ఖాతాల్లో రైతుబంధు సాయం

0
37

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి కాస్త ఆలస్యంగా రైతుబంధు ఇవ్వడంపై రైతులు టిఆర్ఎస్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే నేటి నుంచి తెలంగాణ రైతుల ఖాతాల్లో ఈ వానాకాలానికి సంబంధించి పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది సర్కార్.

తొలిరోజు ఎకరాలోపు పొలం కలిగిన రైతులకు, రెండో రోజు రెండు ఎకరాలు కలిగిన రైతులకు, మూడో రోజు మూడు ఎకరాలు గల రైతులకు ఇలా పెంచుకుంటూ డబ్బు వేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 68 లక్షల 94 వేల మంది రైతులకు కోటీ 51 లక్షల 11 వేల ఎకరాలకు సంబంధించి 7 వేల 654 కోట్ల రూపాయలు అందజేయనున్నారు.

గడచిన యాసంగి సీజన్‌లో 63 లక్షల మంది రైతులకు 7వేల 412 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం పంపిణీ చేశారు. ఈ సారి కొత్త లబ్ధిదారులకు అవకాశం ఇవ్వడంతో సాయం అందించే వారి సంఖ్య పెరిగింది. ఈనెల జూన్ 5లోపు పట్టా అయిన వారు పట్టా బుక్, ఆధార్, బ్యాంకు అకౌంట్ జిరాక్సులను మండల వ్యవసాయాధికారికి అందించాలని అధికారులు తెలిపారు.