డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇటీవలే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్) విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇప్పటివరకు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకే ఈ అవకాశం ఉండేది. దానిని డిగ్రీ విద్యార్థులకు విస్తరిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2025-26 వరకు అమల్లో ఉంటుంది.
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) కింద ఈ శిక్షణ అందిస్తారు. దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో మొత్తం 9 లక్షల మందికి అవకాశం ఇస్తారు. అందుకు రూ.3,054 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాంకేతిక విద్యతోపాటు సంప్రదాయ కోర్సుల విద్యార్థుల్లోనూ ఉద్యోగ నైపుణ్యాలను పెంచాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫారసు మేరకు ఈసారి పథకాన్ని డిగ్రీ విద్యార్థులకూ విస్తరించారు.