తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..49 వేల నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌..‌!

0
269

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జోన్ల వారీగా ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించినట్లు సమచారం.

రాష్ట్రంలో పర్మినెంట్‌, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే కాకుండా ప్రత్యక్ష నియామకాల భర్తీకి మొత్తం 49 వేల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అంచనా వేసిందని పేర్కొంటున్నారు. కొత్త నియమాకాల భర్తీ కోసం కొన్ని రోజుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల శాసనసభలో వెల్లడించింది. దీంతోపాటు ఆర్థిక శాఖకు పలు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉద్యోగ నియామకాల ఫైలును సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం.

ఈ ఉద్యోగాలు తెలంగాణ సర్వీస్‌ పబ్లిక్‌ కమిషన్‌, పోలీసు నియామక, వైద్య, పంచాయతీ నియామక బోర్డుల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ పలు సమావేశాలు నిర్వహించి..ఖాళీల గురించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.