జూన్ 4 నుంచి తిరుమల ఆకాశగంగ వద్ద హనుమాన్ జయంతి వేడుకలు

Hanuman jayanthi celebration at Thirumala Akasha ganga

0
35

తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4 వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు.

తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు. ఈ సారి ఆకాశగంగలో 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం 8 – 30 నుంచి 10 గంటల వరకు అంజనాదేవి, బాల హనుమంతల వారికి అభిషేకం, రోజుకొక పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా ఉంటుందన్నారు.

4వతేదీ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ రాణి సదాశివమూర్తి చే హనుమంతుడు, అష్టసిద్ధులు అనే అంశంపై నేటి పరిస్థితులకు అనుగుణమైన విధంగా సవివర వ్యాఖ్యానం ఉంటుందని చెప్పారు.
5వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చే నేటి యువతకు ఆదర్శం హనుమ అనే అంశంపై వ్యాఖ్యానం ఉంటుందని చెప్పారు.
6వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ నందన్ భట్ చే హనుమంతుని వ్యక్తిత్వం పై వ్యాఖ్యానం జరుగుతుందని ఆయన తెలిపారు.
7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డాక్టర్ మారుతి చే హనుమంతుని వాక్ వైభవం అంశంపై వ్యాఖ్యానం జరుగుతుందన్నారు.
8 వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ రాగి వెంకటాచారి వారిచే హనుమంతుని కార్యదక్షత అనే అంశం మీద వ్యాఖ్యానం నిర్వహిస్తామన్నారు.
ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఈవో వివరించారు.

తిరుమలకు వచ్చే యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు.
వచ్చే ఏడాది మరింత వైభవంగా ఆకాశగంగ వద్ద హనుజ్జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి
రాక్షసుల బారి నుంచి ప్రజలను విముక్తులను చేశారని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
12 పురాణాలు, దైవ సాక్షాత్కారం పొందిన మహా పురుషులు ఆంజనేయ స్వామి వారు ఆకాశగంగ వద్ద జన్మించారని స్పష్ఠంగా చెప్పారన్నారు.ఇందులో ఎలాంటి వివాదం లేదని శ్రీ ధర్మారెడ్డి వివరించారు. అయోధ్య శ్రీ రాములవారి జన్మ భూమి అని నిర్ధారణ అయిన తరువాత తిరుమల ఆకాశగంగ వద్ద ఆంజనేయుని జన్మస్థలంగా నిర్ధారణ కావడం దైవ సంకల్పమని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. ఆకాశగంగ వద్ద ఉన్న అంజనాదేవి, బాలహనుమంతుల దర్శనం కోసం భక్తులు సులువుగా వచ్చి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.