హుజూరాబాద్ బైపోల్- కౌంటింగ్ ఇలా..అభ్యర్థుల్లో ఉత్కంఠ

0
91

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూడంచెల్లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా కరీంనగర్-జగిత్యాల రహదారిలో వాహనాల దారి మళ్లింపుతో పాటు 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనా..మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉపఎన్నిక కౌంటింగ్ మొత్తం 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్​కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం ఫలితం తేలనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్​తో భాజపా, తెరాసలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్ భాజపాకు అనుకూలంగా వచ్చాయి. అయితే ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని తెరాస ధీమాగా ఉంది.