బ్రేకింగ్ న్యూస్ : కాంగ్రెస్ కు పాడి కౌషిక్ రెడ్డి గుడ్ బై

0
41

కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నేత పాడి కౌషిక్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆయన తన రాజీనామాను సోమవారం అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి కీలకమైన పరిణామాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడిన మాటల ఆడియో ఒకటి ముందుగా సోషల్ మీడియాకు ఎక్కింది. దాన్ని కావాలనే సోషల్ మీడియాకు వదలినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం స్పదించింది. పాడి కౌషిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది పార్టీ.

ఈ నేపథ్యంలో వెంటనే కౌషిక్ రెడ్డి స్టెప్ తీసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరడం లాంఛనమే అయింది. హుజూరాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటినుంచి పాడి కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే టిఆర్ఎస్ అనుకూల వాదనలు గుప్పిస్తూ వచ్చాడు. ఈటల ఆస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశాలు లేకపోయినా వ్యక్తిగతంగా ఈటలను టార్గెట్ చేస్తూ ఆరోపణలకు దిగాడు.

అప్పుడే ఆయన టిఆర్ఎస్ గూటికి పోవచ్చన్న టాక్ మొదలైంది. ఇక ఒక అశుభ కార్యంలో పాడి కౌషిక్ రెడ్డి కేటిఆర్ ను కలిశాడు. ఏకాంతంగా కొంతసేపు చర్చించారు. కేటిఆర్ ను ప్రసన్నం చేసుకునే దిశగా కౌషిక్ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో అప్పుడు కూడా పార్టీ మారతాడని కన్ఫాం అయింది. అయినప్పటికీ తాను కాంగ్రెస్ లోనే ఉంటానంటూ కౌషిక్ రెడ్డి బుకాయిస్తూ వచ్చారు.

ఇక ఇవాళ అనుమానాలను పటాపంచలు చేస్తూ కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రేపటి ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి కౌషిక్ బరిలోకి దిగే చాన్స్ ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈటల మీద పోటీ చేసిన కౌషిక్ రెడ్డికి 50వేల ఓట్ల వరకు వచ్చాయి. ఈసారి మరి టిఆర్ఎస్ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంటే ఏమేరకు ఆయన విజయావకాశాలు ఉంటాయో చూడాలి.

ఇక బిజెపి నుంచి ఈటల రాజేందర్ అభ్యర్థిగా ఉండగా… టిఆర్ఎస్ నుంచి కౌషిక్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లే చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి. కాంగ్రెస్ కు ప్రధాన నేతగా ఉన్న కౌషిక్ రెడ్డి పార్టీని వీడడంతో కొత్త అభ్యర్థి వేటలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైనట్లు చెబుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టికెట్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.