నక్సలైట్లు ఉంటే బాగుండేదని, అలా అయిన పాలకులు భయపడేవారని టిపిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా కావాలని కోరుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయని ఆయన అన్నారు.
కరీంనగర్ లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..డీజీపీ ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందని, రాష్ట్రంలో పోలీసు అధికారులు రెండు వర్గాలు అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పోలీసులు నాపై నిఘా పెట్టారన్నారు. రిటైర్డ్ వాళ్లకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చి ఇలా నిఘా పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రుల ఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేశారన్నారు. గతంలో అభివృద్ధికి నక్సలైట్లు అడ్డని..సమాజంలో వాళ్లుండకూడదని రైటిస్టులు భావించేవారని, కానీ నక్సలైట్లు ఉండుంటే ఇప్పుడు ప్రభుత్వ చర్యలను నియంత్రించేవారని సమాజం అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు.