ఏపీ అసెంబ్లీలో వైయస్ జగన్ సీఎంగా రాజధానుల విషయం పై కీలక ప్రకటన చేశారు.. మూడు రాజధానులు ఏపీకి ఉండవచ్చు అని ప్రకటించారు. చంద్రబాబు అయితే దీనిని తుగ్లక్ చర్యగా విమర్శించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు. మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వల్ల రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు అని అన్నారు.
అంతేకాదు రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమే. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు.
అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా?
సీజన్లో ,కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా- సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెలేలు లెజిస్లేటివ్ రాజధానికి రావాలి వెళ్ళాలన్నమాట. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి ఆ తరవాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి గారు ఆలోచనలా ఉంది అంటూ ,వ్యంగ్యంగా ఆయన సటైర్లు వేశారు.