ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్ ‘ప్రజా దర్బార్’కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు సీఎం జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
ఇక సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విన్న వైఎస్ఆర్… వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించేవారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్లెవరూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు వినేవారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.