తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక వెటర్నరీ అధికారులు..ఆ పథకం విధి విధానాల పరిశీలన

0
89

తెలంగాణ రాష్ట్రం కుల వృత్తులపై అధిక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముదిరాజ్ లకు చేప పిల్లల పంపిణి, సబ్సిడీపై వాహనాలు, మంగళి వాళ్లకు ఉచిత కరెంటు, యాదవులకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో  గొర్రెల పంపిణీ పథకం అమలు, పరిశీలనకు కర్ణాటక సీఎం పశుసంవర్ధక శాఖ అధికారులను తెలంగాణకు పంపించారు.

ఈ సందర్బంగా షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తో కర్ణాటక వెటర్నరీ అధికారులు భేటీ అయ్యారు. మాసబ్ ట్యాంక్ గొర్రెల, మేకల అభివృద్ధి కార్యాలయంలో ఈరోజు కర్ణాటక పశుసంవర్ధక శాఖ ఎండి డాక్టర్ జే.పంపాపథి, డాక్టర్ మురళీధర్, గోపాలా క్రిష్ణ సంబంధిత అధికారులు రాష్ట్రంలో అమలవుతున్న గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకం విధివిధానాలు, గ్రామాలలోని లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, అలాగే ఈ పథకం ద్వారా ఆదాయం మెరుగుపడిన విధానం గురించి తెలంగాణ చైర్మన్ బాలరాజు యాదవ్ తో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు అధికారులకు పథకం వివరాలను వెల్లడించారు. 12 వేల కోట్లతో 7 లక్షల 61,896 లబ్ధిదారులను గుర్తించి వారికి యూనిట్ కి 21 గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. మొదటి విడతలో నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు 5000 కోట్లు ఖర్చుపెట్టి 85 లక్షల పై చిలుకు గొర్రెలను పంచడం దేశంలోనే చారిత్రాత్మకం. సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరంతరం SRDP స్కీం అమలుపై పర్యవేక్షణ గురించి వివరించారు.

కర్ణాటక అధికారులు ఈ అంశాలు విని పథకం రూపకల్పన అమలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనం అని, ఈ అంశాలన్నింటిని మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వంకు వివరించి కర్ణాటకలో కూడా ఈ స్కీంని గొల్ల,కురుమలకు, యాదవులకు ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.డి.నర్సింహ్మారావు, డా.సత్యనారయణ, డా.వెంకటయ్య, డా.సాయిరాజ్, డా.మనోజ్ తదితురులు పాల్గోన్నారు.