కేసీఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు.
మూడు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీ ఏర్పాటు హాస్యాస్పదం అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరేనని అన్నారు. కెసిఆర్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. ఎనిమిది ఏళ్లలో బాగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్డిఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు కెసిఆర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వలేదు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు ఉత్తమ్.