రాజకీయ పండితులకే రాజకీయాలు నేర్పిన ఘనుడు తెలంగాణ సిఎం కేసిఆర్. ఆయన మనసుకు నచ్చకపోయినా, మనసులో ఏదైనా అనుకున్నా… భూమి ఆకాశాన్ని ఏకం చేసైనా సరే దాన్ని సాధించి తీరతారు. కాలం కలిసి రావడమే లాంటి డైలాగులు చెప్పొచ్చు… కానీ ఇక్కడ కేసిఆర్ వ్యూహ చతురతను తక్కువ చేసి చూడలేము. కేసిఆర్ స్కెచ్ వేస్తే అవతలివాళ్ల లెక్కలు సెటిల్ అయిపోయాయి. ఈటల లెక్క సెటిల్ మెంట్ కూడా అలాంటిదే.
అస్తమానం బూకర్ బుక్కలు తినేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు, దందాలు నడిపేవాళ్లు, భూకబ్జాలు, సెటిల్ మెంట్లతో హడలెత్తించేవాళ్లు, బ్లాక్ మెయిలింగ్ కేరెక్టర్లే నేటి రాజకీయాల్లో ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈటల రాజేందర్ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి నాయకుడి మీద బురద చల్లడం, పార్టీ నుంచి వెళ్లగొట్టడం అంటే అంత ఈజీ కాదు… కానీ అవతల ఉన్నది కేసిఆర్ కాబట్టి కాఫీ తాగినంత ఈజీగా పని కానిచ్చేశారు.
ఈటలను భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పించారు. వాస్తవానికి భూకబ్జా ఆరోపణలు అనేవి పైకి కనబడుతున్న కబుర్లు… అసలు కథ వేరే ఉందని రాజకీయ వర్గాలకే కాదు సామాన్యులకు సైతం అర్థమైపోయింది. ఎందుకంటే ఈటల కంటే భూకబ్జాకోరులు ఎందరో ఉన్నారు. వారి మీద ఆధారాలతో సహా ఆరోపణలు వచ్చాయి. కానీ వారి మీద ఈగ వాలలేదు. ఈటలకు, కేసిఆర్ కు మధ్య ఎప్పటినుంచో చెడిందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముదిరిందన్న ప్రచారం ఉంది. అందుకే ఈటలను ఉత్తుత్తి ఆరోపణలతో బయటకు పంపినట్లు టిఆర్ఎస్ వర్గాల్లోంచి కూడా వినిపిస్తున్న వాదన.
సరే ఈటల బయటకైతే వచ్చారు. వాట్ నెక్ట్స్. ఆయన సొంత పార్టీ పెట్టడం, బిజెపిలో చేరడం, కాంగ్రెస్ లో చేరడం ఈ మూడు చర్యల్లో కేసిఆర్ కు ఇష్టమైన చర్య.. ఈటల బిజెపిలో చేరడమే. అందుకు అనుగుణమైన కార్యాచరణకు దిగారు కేసిఆర్. కానీ ఈటల మాత్రం తాను తెలంగాణ ప్రాంతీయ పార్టీ పెట్టాలన్న ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసి కేసిఆర్ దూకుడు పెంచారు. ఈటల మీదనే కాదు ఈటల కొడుకు మీద కూడా భూకబ్జా ఆరోపణలు చేయించి విచారణకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా ఈటలను అరెస్టు చేస్తారన్న ప్రచారం చేయించారు. ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగిస్తారని లీకులు ఇచ్చారు. తద్వారా సొంత పార్టీ, కాంగ్రెస్ లో చేరడం… ఈ రెండు దారులను కేసిఆరే మూసేయించారు. అంతిమంగా బిజెపిలో చేరక తప్పని పరిస్థితిని కల్పించారు.
మరి ఈటల బిజెపిలో చేరితే కేసిఆర్ కు ఏం లాభం అనుకోవచ్చు… వాస్తవానికి కేసిఆర్ చాణుక్యం మామూలుగా ఉండదు కదా? తెలంగాణలో ఈటల సొంత పార్టీ పెడితే బడుగు బలహీనవర్గాల మద్దతుతో ఏదో ఒకరోజు సక్సెస్ అయ్యే చాన్స్ ఉంది. అంతేకాదు… ఈటల కాంగ్రెస్ లోకి వెళ్తే.. గ్రామ గ్రామాన పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది… కానీ ఈటల బిజెపిలోకి వెళ్తే మాత్రం… బిజెపి ఇప్పుడున్న పరపతి కంటే జర్రంత పైకి ఎగబాకుతుంది… కాంగ్రెస్ జర్రంత దిగజారుతుంది… అంతిమంగా ఆ రెండు పార్టీలు సమానంగా ఉంటాయి. వాటి కంటే ఒక మెట్టు పైన టిఆర్ఎస్ నిలుస్తుంది. అధికారాన్ని పదిలపరచుకుంటుంది… ఇదీ కేసిఆర్ స్కెచ్ అని ఒక టిఆర్ఎస్ నాయకుడు చేప్పిన మాటలు.
దీన్నిబట్టి చూస్తే… ఈటల రాజేందర్ బిజెపి వైపు అడుగులు వేయడంలో కేసిఆర్ ప్రధాన పాత్ర ఉన్నట్లు వాతావరణమైతే కనబడుతున్నది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.