ప్రచార కమిటీ చైర్మన్ అయినా మధు యాష్కీ గౌడ్ కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డాడు. తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మర్చి టీఆర్ఎస్ సర్కార్ రస్థులను కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సుమారు రూ. 10 వేల కోట్లు ఉండగా..ఏడేండ్లో మద్యం అమ్మకాల సొమ్ము రూ.లక్ష 35 వేల కోట్లు పొందినట్టు తెలిపాడు. అందుకే సమాజం బాగుపడాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా పోరాటాలు చేయాలనీ హెచ్చరించాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణగా అవతరిస్తుందని సమాజం కలలుకంది. 2014లో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. లిక్కర్ తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చేశాడు. తనకు ఇష్టమైన తాగుడును మొత్తం రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ నల్లానీళ్లు రావుకానీ.. మద్యం సీసాలు వచ్చేలా విచ్చలవిడిగా అమ్మకాలు పెంచిన ఘనత చంద్రశేఖర్ రావుకే దక్కుతుంది. కేసీఆర్ టార్గెట్ మద్యం అమ్మకాలవల్ల సంపాదన అంతా అబ్కారీకి.. సంసారాలు వీధిపాలు అవుతున్నాయి. మద్యం మత్తులో పెరుగుతున్న క్రైమ్ రేట్ కు అంతులేకుండా పోతోంది. మద్యం మత్తులో జరుగుతున్న నేరాలకు ఘోరాలకు ప్రధాన బాధ్యుడు చంద్రశేఖర్ రావే. తెలంగాణ వచ్చిన నాటినుంచి మద్యం అమ్మకాల తీరును గమనిస్తే.. చంద్రశేఖర్ రావును.. చంద్రలిక్కర్ రావుగా పేర్కొనాలి. ఉమ్మడి రాష్ట్రంలో 30 పబ్బులంటే ఇప్పుడు వాటి సంఖ్య 100 దాటింది. వీటిని టీఆర్ఎస్ నాయకులు, వారి అనుచరులే నడిపిస్తున్నారని పత్రికల్లోనూ, వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. ఈ పబ్బుల్లోకి మైనర్లకు అనుమతించడం.. డ్రగ్స్, విచ్చల విడిగా మద్యం.. టైమింగ్ పాటించకపోడం.. తాజాగా మంత్రి మనవడు ఇచ్చిన పార్టీలో 70 శాతం మంది మైనర్లే ఉండడం.. కొన్ని ఉదాహరణలు మాత్రమే.
రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో 2,216 వైన్స్ ఉండగా.. వాటి సంఖ్య ఇప్పుడు 2620కి చేరింది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 1060 బార్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 1219కి పెరిగింది. ఇవికాక ఊరికి ఐదారు బెల్టుషాపులు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్నాడు కానీ.. లిక్కర్ తెలంగాణగా మార్చిండు. కేవలం మద్యం మీదనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నెలకు రూ. 2500 కోట్ల నుంచి రూ.3000 వేల కోట్ల వరకూ కొల్లగొడ్తున్నాడు. తెలంగాణ వచ్చిన కొత్తల్లో అంటే 2014-15లో మద్యం ఆదాయం రూ.10,880 కోట్లు ఉండగా, 2018లో రూ.20 వేల కోట్లకు చేరింది. 2020కి వచ్చేనాటికి ఇది రూ.26 వేల కోట్లు అయితే.. 2021లో రూ. 31 వేల కోట్లకు పెరిగింది.. ఈ ఏడాది కనీసం రూ.40 వేల కోట్లను కొల్లగొట్టే లక్ష్యంతో చంద్రశేఖర్ రావు ఉన్నాడు.
తెలంగాణ వచ్చినంక ఈ ఏడేండ్లలో మొత్తంగా లక్ష 35 వేల 631 కోట్ల ప్రజాధనాన్ని మద్యం అమ్మకాల ద్వారా కొల్లగొట్టాడు. మద్యం అమ్మకాల ద్వారా ఒకపైవు.. డ్రంకన్ డ్రైవ్ ద్వారా మరోవైపు ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నాడు. మద్యం మత్తులో హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో కన్న కూతిరిపైనే లైంగికదాడి.. నల్గొండ జిల్లా ముషంపల్లి మద్యం మత్తులో ఇద్దరు యువకులు రోడ్డుపై వెళుతున్న మహిళపై అత్యాచారం.. ఆపై హత్య.. మద్యం మత్తులో హైదరాబాద్ లోని అంబర్ పేటలో మల్లమ్మ అనే మహిళను తాగుబోతులు కారును రాష్ డ్రైవింగ్ చేస్తూ పొట్టన పెట్టుకున్నారు.. ఈ ఏడాది మార్చిలో మేడ్చల్ జిల్లాలో మద్యం తాగి రాష్ డ్రైవింగ్ .. యాక్సిడెంట్ ఘటనలో ఇద్దరు మరణం.. మరో 7 మంది తీవ్రగాయాల పాలవ్వడం.. ఈ ఏడాది మార్చిలో బోధన్ ఎమ్మెల్యే స్టికర్ ఉన్న కారు నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ కారణంగా రెండేళ్ల చిన్నారి మరణం… తాజాగా మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.
మద్యం వల్ల జరుగుతున్న నేరాలకు ఘోరాలకు బాధ్యుడు చంద్రశేఖర్ రావు. తాజాగా బంజారాహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచారం ఘటనకూడా ఈ కోవలోదే. ఈ ఘటనలో నేరస్థులను ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు. ముఖ్యమంత్రి అండదండలు లేకపోతే ప్రజాప్రతినిధులు కొడుకు అంత దారుణంగా ప్రవర్తిస్తాడా? చంద్రశేఖర్ రావు తన అధికారాన్ని కాపాడుకునేందుకే నిందుతులను కాపాడుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీకు మానవత్వం ఉంటే కులం చూడకుండా.. మతం చూడకుండా నేరస్థులను శిక్షించాలి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి వాస్తవాలు గ్రహించండి.. కేసీఆర్ తన గద్దెను కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా ఒడిగడతాడు. మానవత్వం లేని మనిషి.
పబ్బుల్లొకి మైనర్లను అనుమతించకూడదు. అయినా ముఖ్యమంత్రికి తెలిసే ఇదంతా జరుగుతోంది. టీఆర్ఎస్ అండదండలతోనే పబ్బులు గబ్బుులు నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని నేరాలకు, ఘోరాలకు మద్యం ప్రధాన కారణంగా మారుతోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో అనర్థాలు దాపురిస్తున్నాయి. సంపాదన మొత్తం మద్యం పాలు అవుతోంది.. సంసారాలు వీధిపాలౌవుతున్నాయి. ఈ ఆరాచకాలకు అడ్డుకట్టు వేసేందుకు సంపూర్ణ మద్యపాన నిషేధమే మార్గం. సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రజలంతా ముందుకు రావాలి. మరో తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాలు మొదలవ్వాలి. కల్వకుంట్ల చంద్ర లిక్కర్ రావుపై ప్రజలంతా తిరుగుబాటు చేయాలని పిలుపిస్తున్నట్టు తెలిపాడు.