సిఎం కేసిఆర్ కు దమ్ముంటే మంత్రి పదవి తొలగించినంత ఈజీగా ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కెసిఆర్ కు నిజంగా దమ్ముంటే ఈటెలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. టిజేఎస్ అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరాం తో కలిసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఈటలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కొండా మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ రాజకీయ కక్షతోనే ఈటల మీద వేటు వేశారని ఆరోపించారు. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చామని అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజల జీవితాలు అతలాకుతలం అయితుంటే వారిని పట్టించుకోకుండా ఫాం హౌజ్ లో కూర్చొని దిగజారుడు రాజకీయాలు చేసున్నారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఈ చౌకబారు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులంతా కలిసేలా ఐక్య వేదిక కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు కొండా.
అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విచిత్రమైన రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకొని సయోధ్య కుదుర్చుకోవాలి తప్ప కక్ష సాధించడం ఏంటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ లో పని చేసే వారు ఎవరైనా తన నీడలో బతకాలని కేసిఆర్ అనుకుంటాడని విమర్శించారు. వ్యక్తిగతంగా తనకంటే ఎత్తు ఎదిగితే ఒర్చుకునే స్వభావం లేకపోగా విద్వేషం చూపిస్తాడని కేసీఆర్ మనస్తత్వాన్ని వెల్లడించారు కోదండరాం. కేసీఆర్ కు భజన చేయని వారిని రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడతారన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమ్మెకు దిగుతున్నా వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకొవడం లేదని మండిపడ్డారు.
భూ కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులను కూడా ఇరికించి బాధ పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అండ్ కో ఈ రాజకీయ కక్ష్య సాదింపు దాడులు ఆపాలని డిమాండ్ చేసారు. ఈటల రాజేందర్ మీద దాడిని ఆత్మ గౌరవం మీద దాడి గానే చూస్తున్నామన్నారు కొదండరాం.