బట్టి విక్రమార్కకు మంత్రి హరీష్ బలే కౌంటర్ ఇచ్చిండు

0
42

భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టిన సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భూముల అమ్మకాలపై ప్రతిపక్షాల విమర్శలపై సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి.

కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యవహారం గురిగింజ తీరుగా ఉంది. అసలు ఆస్తుల అమ్మకం ప్రారంభించిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. భట్టి విక్రమార్క భూములు అమ్మొద్దు.. అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటాం అనడం హస్యాస్పదం. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ 88,500 ఎకరాల భూములు అమ్మారు. గతంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అమ్మి ఆంధ్రాలో, రాయలసీమలో ఖర్చు పెడుతున్నారు అని.. నేను అసెంబ్లీలో అడిగితే నేటి ఈ కాంగ్రెస్ నాయకులు నోరు మెదప లేదు.

నాటి ప్రధాని పీవీ నరసింహారావు నుంచి నేటి మోదీ వరకు పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న వారే. కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. నిరర్ధక ఆస్తులు తీసేసి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అడ్డుకోవాలని ప్రతిపక్షలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం వదిలి.. అధికారయావతో రాజకీయాలు చేస్తున్నాయి.

భట్టి విక్రమార్క తన సీనియారిటీకి తగ్గట్టుగా మాట్లాడాలి. భూముల అమ్మకాలు అత్యంత పారదర్శకంగా  నిర్వహిస్తున్నాం. భూముల అమ్మకాలతో వచ్చే ప్రతి పైసాను ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తాం. ప్రభుత్వ ఆస్తులు అమ్మాలని కోరుతూ… ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మాకు లేక రాసింది. కేంద్రం odf, bdl, విశాఖ ఉక్కు, రైల్వే వంటి సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తోంది. 24 ప్రభుత్వ సంస్థల్లోని వాటాలను బీజేపీ ప్రభుత్వం 145 సార్లు అమ్మింది.

బీజేపీ ఒక్క సంవత్సరంలోనే పెట్రోల్ మీద 25రూపాయలు, డీజిల్ మీద 23 రూపాయలు పెంచింది. కరోనా కష్ట కాలంలో తెరాస ప్రభుత్వం ప్రజలను అదుకుంటోంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ మీద ఎక్సయిజ్ పన్ను 9 రూపాయలు ఉంటే ఇప్పుడు 32 రూపాయలకు పెంచింది. తెరాస ప్రభుత్వం పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది.

అసెంబ్లీ సాక్షిగా.. నిరర్ధక ఆస్తులు అమ్మి ఆదాయం సమకూర్చుకుంటామని బడ్జెట్ లోనే చెప్పాం.ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఆగిపోనియం… అని మీడియా సమావేశంలో ప్రత్యర్థులకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.