ఈసారి బతుకమ్మ చీరలు భలేగున్నాయ్..!

More beautiful Batukamma sarees this time

0
102

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరాయి. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను 2వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా తెలంగాణలో అక్టోబర్ 6 నుండి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి.

దాదాపు 18 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతేడాది పంపిణీ సంద ర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో రూపొందించారు. డాబీ అంచు ఈసారి మరింత ప్రత్యే కతను తీసుకురానుంది. చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ..పట్టణాలు, నగరాల్లో రేషన్ డీలర్, పురపాలిక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి లబ్దిదారులు చీరలు పొందవచ్చు. ఈ సందర్భంగా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరనీ..కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.