సీఎం కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

0
96

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అహంకారం మితిమీరి పోయింది. ఆయనకు మహిళలపై ఉన్న చిన్నచూపును చివరికి రాష్ట్ర ప్రథమ మహిళ అయిన గౌరవ గవర్నర్ డా.తమిళసై గారిపై కూడా చూపించుకున్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని రాజ్యాంగం ప్రకారమే మనమందరం నడుచుకోవాల్సి ఉంటుంది. కాని ఈ సీఎం సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.

మొదటి సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ కేసీఆర్ సీఎం అయ్యాక తన క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరునెలల పాటు క్యాబినెట్ విస్తరణే చేయలేదు. బడ్జెట్ ను క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి, బడ్జెట్ సమావేశాల ముందు క్యాబినెట్ ను విస్తరించారు. చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. వాటన్నింటినీ కేసీఆర్ తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఈయన 9 వ అసెంబ్లీ సెషన్స్ ను ప్రారంభిస్తున్నారు. పైగా అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు కాబట్టి ఈ సెషన్స్ కూడా 8వ సమావేశాల్లాగే పరిగణిస్తారట. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే కొత్త బడ్జెట్ సంవత్సరంలో సెషన్స్ ప్రారంభం కావాలి. కాని ఈ చంద్రశేఖర రావు రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. కాబట్టి ఈ రూల్స్ ఏవీ ఆయన పాటించడం లేదు. తాను ఒక రాజును, తెలంగాణ ఒక రాజ్యం అనుకుంటున్నాడు. అందుకే తాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు ఫాలో కావాలి, తానే ప్రత్యేక రాజ్యాంగం రాసుకుంటా అంటున్నాడు.

ప్రకాశ్ రాజ్, కేసీఆర్ దోస్తానా చూస్తుంటేనే వాళ్ల ఉద్దేశం అర్థం అవుతోంది. దేశం ముక్కలు కావాలే అన్న భావజాలం ఉన్న జిగ్నేష్ మేవానీ బృందాన్ని ముందు నుంచి ప్రకాశ్ రాజ్ సమర్ధిస్తున్నాడు. కేసీఆర్ కూడా భారతదేశం ఐక్యంగా కాకుండా చిన్న చిన్న రాజ్యాలుగా మారాలని కోరుకుంటున్నాడేమో. అందుకే వీళ్లిద్దరు కలిసీ దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీల నేతలతో మీటింగ్ లు పెడుతున్నారు. దేశాన్ని ముక్కలు చేయడమే వీళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గౌరవ గవర్నర్ గారినే గుర్తించనప్పుడు, ఈ సీఎంకు ఆ సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదు. కేసీఆర్ అహంకానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. త్వరలో ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం అని ధర్మపురి అరవింద్ తేల్చి చెప్పారు.