రేవంత్ రెడ్డి చేతికి అమ్మవారి రక్ష కట్టిన సీతక్క

0
98

మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్ లో టీపీసీసీ నూతన అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క.  మేడారం సమ్మక్క, సారాలమ్మ దేవుళ్ళ వద్ద ప్రత్యేక పూజలు చేసి తెచ్చిన బొట్టు పెట్టి, రక్ష కట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీతక్కతో పాటు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రామచంద్ర నాయక్, విజయ రమణ రావు తదితరులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ములుగు నుంచి సీతక్క వెంట భారీ కాన్వాయ్ గా వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కార్యకర్తల అభీష్టం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ గా నియమించిందన్నారు. సీల్డ్ కవర్ అని విమర్శిస్తున్న వారివి ఒట్టి మాటలే అని, అవి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు, భగవంతుని ఆశీస్సులే రేవంత్ రెడ్డిని పీసీసీ వరించేట్లుగా చేశాయన్నారు. ఇప్పుడు పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు.

వేల సంఖ్యలో అభిమానులను చూస్తుంటే నిజంగా పండగ వాతావరణం లా అనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పూర్తిగా పటిష్టం కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు ఓర్చుకోలేకే సీల్డ్ కవర్ అని మాట్లాడుతున్నారని వారిని అసలే పట్టించుకోవద్దని సూచించారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డికి భారీ ప్రణాళికే ఉందన్నారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతారని, పార్టీని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం అని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ కు ఈ రోజు పీసీసీ ఏ ఒక్క నేత చెబితే రాలేదని.. కార్యకర్తలు, పబ్లిక్ పల్స్ తెలుసుకొని సోనియా గాంధే స్వయంగా పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే రేవంత్ కు పీసీసీ ఇచ్చారని స్పష్టం చేశారు. పీసీసీ వస్తుందని తెలిసి.. దళిత సాధికారత అని సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన సబ్ ప్లాన్ ను తుంగలో తొక్కి.. ఎంపవర్మెంట్ అని డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం నుంచి ఒక దళిత మహిళ మరియమ్మను తీసుకొచ్చి.. భువనగిరి లో కొట్టి చంపారంటే ఎంత దౌర్జన్య పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు.

హైదరాబాద్ చుట్టూ విలువైన భూములను అమ్ముతున్నారని, పేదలకు 125 గజాల స్థలం ఇవ్వడానికి మనసురాదని విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే.. నిరుపేద వర్గాలకు అండగా ఉంటుందన్నారు. మోసం చేయడంలో, మభ్యపెట్టడంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ మాయలను కట్టి పెట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.