రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌..తొలి రౌండ్‌లో ఎన్​డీఏ అభ్యర్థి ముర్ము ముందంజ‌

0
76

రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 11 గంటలకు మొదలైంది. తాజాగా ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు.

ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ముర్ముకు తగినంత మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్‌ ఈ నెల 18న పార్లమెంటు భవనంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు.  ఆపై ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది.