కరోనో మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 11వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని డీసీసీ అధ్యక్షులు జిల్లా కేంద్రాలల్లోనూ, నియోజక వర్గ కేంద్రాలలో నియోజక వర్గ బాధ్యులు, మండల, పట్టణ కేంద్రాలలో ఆయా నాయకులు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన సూచించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గృహవసరాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72 డీజిల్ పై లీటరుకు 23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ పంపుల ముందు రేపు జూన్ 11, శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు..
ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక మందగమనం, విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత, ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని. ఈ ప్రజా వ్యతిరేక అంశాలపై మనం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలలో సీనియర్ నాయకులు, ఎంపిలు, ఎంఎల్‌ఎఎస్ / ఎంఎల్‌సిఎస్, ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమాలన్నీ అధికారులు నిర్దేశించిన కోవిడ్ -19 ప్రోటోకాల్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మాస్కలు ధరించి, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.