యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం పై ప్రత్యేక కథనం

Ramappa Temple is a UNESCO World Heritage Site special story

0
84

 

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు.

రామప్ప దేవాలయము :నిర్మాత…రేచర్ల రుద్రా రెడ్డి

ఆలయ ప్రాంగణంలో కల ఒక మంటపం
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్దములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిథిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిథిలమైపోయింది.నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.

శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా హైదరాబాదు
ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున “రామప్ప గుడులు” కలవు. వాటిని క్రీ.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నముగా తీర్చిదిద్ది ఆనందించినారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడినవి. ఆ కాలములో జాయసేనానియను నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును వ్రాసెను. అది తంజావూరి లిఖిత పుస్తకాలలో నున్నది. కాని, దానిని ముద్రించుట కెవ్వారును పూనుకొనరయిరి. జాయప గ్రంథమునకు ఉదాహరణము లాస్తంభాలపై నాట్యముచేస్తున్న సుందరీమణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రించిన ఎంత బాగుండునోకదా!

ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.

శిల్ప కళా చాతుర్యం:

ప్రధాన వ్యాసం: రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.

వ్యాసకర్త : సామల కృష్ణారెడ్డి (చరిత్ర అద్యాపకులు)