టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం సభలు, సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదును దొరికితే చాలు అధికార పార్టీని రేవంత్ రెడ్డి ఇరుకున పెడుతున్నాడు. రేవంత్ దూకుడుతో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తాజాగా భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతిని ఎండగట్టారు. తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కులు కాల రాసి సింగరేణిని బొందలగడ్డగా కేసీఆర్ మార్చారు. 1200 మంది అమరులైంది కేసీఆర్ కుటుంబం కోసమా అని ప్రశ్నించారు?
తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ ఎంతో నష్టపోయిన తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ లు కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గౌరవం దక్కించాలి.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓకబ్జా కోరు. గుండెల్లో పెట్టుకున్న మిమ్మల్ని గుండెలపై తన్ని గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గరకు వెళ్లిండు. పోలీసులు మా కార్యకర్తలను వేధిస్తే మీపేర్లు డైరీలో రాసుకుని గుర్తుపెట్టుకుంటాం అని అన్నారు. దారివెంట ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళల్లో ఆనందం కన్పించిందన్నారు.
కాగా ఆ సభలో సత్యనారాయణ అనే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందగా..రేవంత్ రెడ్డి వేదికపై సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున అతని కుటుంబానికి రూ.3 లక్షలు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.