వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా ఈజ్‌బ్యాక్..! ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజే తన దైనశైలిలో ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీని అలంకరించే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాకపోవడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు. అనుభవం ఉన్న నేత హుందాతనంతో వచ్చి స్పీకర్‌ని కూర్చోబెట్టవచ్చు కదా..అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు రోజా.
ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. తమ్మినేని స్పీకర్ కావడం అచ్చెన్నాయుడుకు కడుపు మంటగా ఉన్నట్టుందని, గత సభలో టీడీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. ఎన్నిసార్లు చెంపలు వాయించుకున్నా సరిపోదన్నారు. కాల్‌మనీపై ప్రశ్నించినందుకు.. రూల్స్ విరుద్ధంగా తనను ఏడాదిపాటు బహిష్కరించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రూల్స్‌పై టీడీపీ మాట్లాడం దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉందని రోజా విమర్శించారు.