రష్యా-ఉక్రెయిన్‌ వార్..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన

Russia-Ukraine war .. US President Joe Biden's key statement

0
30

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్​కు పరిమితం కావని.. భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా దాడిని కొనసాగిస్తుందని బైడెన్​ పేర్కొన్నారు. అయితే, మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ పరిరక్షించుకుంటామని తెలిపారు.

పుతిన్​.. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు బైడెన్. ‘పాశ్చాత్య దేశాలు, నాటో ఈ దాడులకు స్పందించవని పుతిన్​ భావించారు.. కానీ పుతిన్​ అంచనా తప్పు.. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము.’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు.

‘‘మా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడడం లేదు. కానీ మా నాటో మిత్రదేశాలను రక్షించడానికి, పుతిన్ పశ్చిమ దేశాలవైపు కన్నెత్తి చూడకుండా నిరోధిస్తాయి. పోలండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి భూ బలగాలు, వాయుసేన, నౌకలను సిద్ధం చేశాం’’ అని చెబుతూ రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్​ ప్రజలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం విధించడం ద్వారా రష్యన్​ విమాన సేవలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన మిత్ర దేశాల సరసన చేరనున్నట్లు పేర్కొన్నారు.