రష్యా వర్సెస్ ఉక్రెయిన్..ఈ యుద్ధంలో ఎవరి బలమెంత?

0
103

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి జరుగుతుంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా? ఉక్రెయిన్ కు సాయం చేయవా..?  మన దేశం ఏం చేస్తుంది? ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలాబలాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

పుతిన్‌ సేన ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ సామర్థ్యం వెలవెలబోతోంది. క్షిపణి పరిజ్ఞానం, ట్యాంకు బలగం విషయంలో రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. జలాంతర్గాముల బలంలో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో అమెరికా, యూకే, కెనడా నుంచి ఈ మధ్య ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా పెరిగింది. అయితే ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా వద్ధే యుద్ధ సామాగ్రి అధికం. రష్యా సైనిక బలం 9 లక్షలు. ఉక్రెయిన్ సైనిక బలం 2 లక్షలు మాత్రమే.  2014లో పుతిన్‌ సేన.. ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. నాడు కనీస పోరాటం కూడా చేయకుండానే ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. తర్వాత తన శిక్షణను మెరుగుపరచుకుంది. ఈసారి మాతృదేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రక్షించుకోవాలన్న సంకల్పం కనిపిస్తోంది.

కానీ ఉక్రెయిన్‌ విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీంతో రష్యా యుద్ధవిమానాలకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. రష్యాకు 4వేల 173 విమానాలు 772 ఫైటర్‌ జెట్లు, 15వందల 43 హెలికాప్టర్లు, 544 దాడి హెలికాప్టర్లు, 12వేల 420 యుద్ధ ట్యాంకులు, 30వేల 122 ఆర్మీ వాహనాలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌కు కేవలం 318 విమానాలు, 69 ఫైటర్‌ జెట్లు, 112 హెలికాప్టర్లు, 34 దాడి హెలికాప్టర్లు, 2వేల 596 యుద్ధ ట్యాంకులు, 12వేల 303 ఆర్మీ వాహనాలు ఉన్నాయి. అయితే మొత్తానికి ఉక్రెయిన్ పై రష్యాదే పైచేయి. మరి ఈ యుద్ధం చివరికి ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.