సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అభ్యంతరకరంగా ఉంది: సిపిఐ రాష్ట్ర ఇన్చార్జ్ కార్యదర్శి

0
41

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు వానను సైతం లెక్క చేయకుండా వరుసగా రెండోరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు విపక్షాలు మద్దతు తెలుపగా..విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవని వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాజాగా విద్యార్థుల సమ్మెపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన ప్రకటన చాలా అభ్యంతరకరంగా ఉందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి విమర్శించారు.

వైస్ ఛాన్సలర్ విషయం విద్యార్థులకు ఎందుకని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయం వారికి ఎందుకని ఆమె వ్యాఖ్యానించడం అర్థం లేని విషయం. ఒక విద్యాసంస్థలో ఉన్న సమస్యలను సహజంగానే విద్యార్థులు లేవనెత్తుతారు. ఈ సమ్మె వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని విమర్శ చేయడం సాకుగా కనబడుతుంది. ఎక్కడ సమస్య ఉన్నా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సమస్యలో వాస్తవాలనుబట్టి బలపరుస్తాయి.

బాసరలో సమ్మెకు విద్యార్థులే ప్రాముఖ్యతను ఇచ్చారు. వారు లేవనెత్తిన డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. అంత పెద్ద విద్యాసంస్థకు వైస్ ఛాన్సలర్ లేకుండా, పర్మనెంట్ లెక్చరర్స్ లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా నడపడం బాధ్యతారాహిత్యం. అందువలన ఈ రకమైన రెచ్చగొట్టే ప్రకటనలు మానుకొని, విద్యార్థులతో చర్చించి సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుందని పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు.