వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారంనాడు రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల శాసన సభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినతిపత్రం సమర్పించారు. నూతనంగా ఏర్పడిన జిల్లానే కాకుండా, వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, పేద ప్రజలకు సత్వర వైద్యం అందేందుకు వీలుగా ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.
వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచినందున వికారాబాద్ జిల్లాను కూడా పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. వికారాబాద్ జిల్లాను గద్వాల జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కు మార్చినందుకు జిల్లా శాసన సభ్యులు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటైతే రాష్ట్రంలో వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని మంత్రి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే వైద్య పరంగా అనేక చర్యలు తీసుకున్నారని కళాశాల తో పూర్తి స్థాయి మెడికల్ హబ్ గా మారుతుందన్నారు.ఇప్పటికే సరస్వతి నిలయంగా వెలుగొందుతున్న వికారాబాద్ లో ప్రఖ్యాత అనంతగిరి గాలికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముఖ్యమంత్రి ని కలిసినవారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు,మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి,శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, యాదయ్య, మహేష్ రెడ్డి, ఆనంద్, రోహిత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎం ఎల్ సి లు ఎగ్గే మల్లేశం,దయానంద్ తదితరులు ఉన్నారు.