పోచారంతో స్పీకర్ పదవికే కళంకం..రాష్ట్ర సర్కార్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్

0
97

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.

సభ్యులందరినీ సమన్వయం చేస్తూ సభ సజావుగా జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున..స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లకు అప్పగించిన లోక్ సభ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు శాసనసభ స్పీకర్ తీరుపై నిప్పులు చెరిగారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై వారం రోజులవుతున్నా… ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఏర్పాట్లపై చర్చ కూడా జరపలేదు. ఏమైనా అంటే కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు హిందూ పండుగలంటేనే షరతులు గుర్తుకొస్తాయి. ఇతర వర్గాల పండుగల విషయంలో ఇవేమీ పట్టవు. హిందువుల మధ్య గందరగోళం స్రుష్టించి ఆ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్ర చేస్తున్నరు. అందులో భాగంగా హిందువుల పండగలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టడంతోపాటు వారి మధ్య భయాందోళనలు స్రుష్టిస్తున్నారు.

హిందూ సమాజం సంఘటితం కాకుండా కుట్ర చేస్తున్నరు. కేసీఆర్ సర్కార్ తీరుకు నిరసనగా తక్షణమే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ కేంద్రాల్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేశాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ అంటేనే గజగజ వణికిపోతున్నరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు నిలదీస్తారనే భయం పట్టుకుంది. అందుకే సభను రెండ్రోజులపాటే నిర్వహించి తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నరు. ఇదే విషయంపై బీజేపీ సభ్యులు స్పీకర్ ను ప్రశ్నిస్తే వారిపై చర్యలు తీసుకోవాలంటూ చర్చ చేస్తుండటం సిగ్గు చేటు.

రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ సభ్యులందరినీ సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తూ సభ సజావుగా జరిగేలా చూడాల్సిన శాసనసభ స్పీకర్ అందుకు భిన్నంగా సీఎంకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.

స్పీకర్ పై విమర్శలు చేస్తారా? అని అడుగుతున్న నాయకులను నేను అడుగుతున్నా… రాజ్యాంగబద్దమైన స్పీకర్ హోదాలో ఉంటూ కేంద్రమంత్రిపై రాజకీయ విమర్శలు చేస్తారా? రాజ్యంగబద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధంగా ఇంకొకరిని విమర్శించే హక్కు ఆయనకు ఎక్కడిది? ముందు దీనిపై సభలో చర్చ జరగాలి.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్పీకర్ పదవికే కళంకం తీసుకొస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి పైనే ముందు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నారు. అందుకే సభ కూడా పూర్తిస్థాయిలో జరపకుండా రెండ్రోజులకే పరిమితం చేస్తున్నారు.

ప్రజా సమస్యలపై చర్చించి అసెంబ్లీ వేదికగా పరిష్కారం లభించేలా చేయాలని బీజేపీ సభ్యులు ప్రయత్నిస్తుంటే… అందుకు భిన్నంగా సీఎం వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం రాకపోతే… ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటాం.