తెలంగాణ సీనియర్ జర్నలిస్టుకు అవమానం : అడ్డంగా ఫైన్ వేశారు

హైదరాబాద్ పోలీసులు రెచ్చిపోతున్నారు

0
110

ఆయన హైదరాబాద్ లో గత 40 ఏళ్లుగా జర్నలిస్టు. ఆయన పేరు రాజు. ఆంధ్రప్రభ, విశాలాంద్ర పత్రికల్లో స్టేట్ బ్యూరో కరస్పాండెంట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న వెటరన్ జర్నలిస్టు. ఆయనకు నాలుగు దశాబ్దాలుగా ఐఅండ్ పిఆర్ డిపార్ట్ మెంట్ జారీ చేసే అక్రిడేషన్ కార్డు కూడా ఉంది.

ప్రెస్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ లు, పోలీస్ స్టిక్కర్లను తొలగించే పనిలో నిమగ్నమైన హైదరాబాద్ పోలీసులు రెచ్చిపోతున్నారు. ఉత్తుత్తిగా ఇలాంటి స్టిక్కర్లు బండ్ల మీద అతికించుకుని తిరిగే వాళ్లకు ఫైన్ వేసినా అందం సందం. కానీ అసలు సిసలైన జర్నలిస్టును పట్టుకుని బండికి ప్రెస్ స్టిక్కర్ వేసుకున్నావు కాబట్టి 700 ఫైన్ కట్టు అని కాయితం తీసి చేతులో పెట్టారు… అలాకాదు… తాను నిజమైన జర్నలిస్టునే అని రాజు చెప్పినా వాళ్ల చెవికెక్కలేదు. అంతేకాదు… తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఅండ్ పిఆర్ శాఖ వారు జారీ చేసిన అక్రిడేషన్ కార్డును చూపినా ఖాకీలకు కనికరం రాలేదు.

ఇలాంటి పరిణామాలు తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని జర్నలిస్టు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం అసెంబ్లీ, గాంధీభవన్ బీట్ రిపోర్టర్ గా రాజు పనిచేశారు. కానీ ఇలా ఒక సీనియర్ జర్నలిస్ట్ అందులోనూ…. అక్రిడేటెడ్ జర్నలిస్టుకు ఈ దుస్థితి రావడం పట్ల జర్నలిస్టు వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ట్రైనీ జర్నలిస్టులు, ఇతరత్రా లోకల్ జర్నలిస్టులు ఇవాళ అక్రిడేషన్లు పక్కనపెడితే కనీసం ఐడి కార్డులకు కూడా నోచుకోకుండా పనిచేస్తున్నారు. అలాంటివారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. పోలీసు సార్లూ జర అసలు సిసలు జర్నలిస్టులకు కూడా ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకోవద్దని ఏమైనా ఆర్డర్ వచ్చిందా? లేదంటే అయినోడు కానోడు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకుంటే వారిని కంట్రోల్ చేయాలని ఆర్డర్ వచ్చిందా చూసుకుని నడుచుకుంటే మంచిది. లేదంటే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పుదు అని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.